AP Election Results: ఏపీలో రేపే ఎన్నికల కౌంటింగ్.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే.. మెజారిటీ ఎవరిదో ఎన్నింటికి తేలనుందంటే?
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడనుంది. ఎన్నికల్లో ఎవరు జయకేతనం ఎగురవేస్తారనే దానిపై రేపు మధ్యాహ్నంతో క్లారిటీ రానుంది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో ఏ అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గం ఫలితం తొలుత వస్తుంది.. ఏ అభ్యర్థి జాతకం మొదట్లో తేలిపోనుందనే విషయం గురించి తెలుసుకుందాం. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకటన తర్వాత కూడా ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఏపీ ఎన్నికల ఫలితం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఉత్కంఠకు తెరపడనుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం (జూన్ 4) వెలవడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఓ స్పష్టత రానుంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ నేపథ్యంలో ఏపీకి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 26,473 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ ద్వారా.. 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. మరోవైపు ఏపీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీల సంగతికి వస్తే.. 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 33 ప్రాంతాల్లోని 401 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది
ఏపీ ఎన్నికల్లో తొలి, తుది ఫలితాలు ఇక్కడే..
మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాలకు తొలుత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రెండుచోట్ల 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. దీంతో కౌంటింగ్ ప్రారంభమైన ఐదుగంటల్లోగా వీటి ఫలితాలు వెల్లడవుతాయి. కొవ్వూరులో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ కూటమి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. ఇక నరసాపురం విషయానికి వస్తే వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజు.. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ బరిలో ఉన్నారు.